Pages

Sunday 4 October 2015

Revolutionary Songs By Traitors In Telangana

A pen is mightier than sword/gun..

A timely article titled "వంచకుల విప్లవగీతాలు" by Katta Shaker Reddy in Namasthe Telangana paper on 4-October-15 has exposed the people chanting Maoism on this soil and who are encouraging others to swallow the expired and not prescribed medicine suitable for our conditions...


ఒక వర్గం మీడియా, సీపీఎంతో సహా కొన్ని రాజకీయపార్టీలు ఇప్పుడు విప్లవగీతాలు ఆలాపించవచ్చు. కానీ వారి చరిత్రను ఎవరూ తుడిపేయలేరు. మేము ప్రభుత్వాలను శాసిస్తాం. నడిపిస్తాం. కాళ్లదగ్గరకు తెచ్చుకుంటాం. ఎవరినయినా లొంగ దీసుకుంటాం అని భ్రమించిన మీడియా తెలంగాణలో అది సాగకపోయే సరికి భంగపడి విచ్చలవిడిగా తెలంగాణ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నది. అందుకు ఏ సందర్భం దొరికినా అది వదలడం లేదు. మావోయిస్టులపై వారి విపరీత ప్రేమ కూడా అందులో భాగమే.

గద్దర్ వెన్నులో గన్ను దించినవాడికి దీపారాధనలు చేసేవారు, మెరికల్లాంటి మావోయిస్టు యోధులను ఎక్కడో పట్టుకొచ్చి తెలంగాణ గడ్డపై దారుణంగా కాల్చి చంపిన హంతక హస్తాలతో నిత్య కరచాలనం చేసేవారు, ఆంధ్ర రాష్ట్రం వచ్చీ రాగానే మావోయిస్టులను బలితీసుకున్న ఎన్‌కౌంటర్ స్పెషలిస్టును తన అక్షరా ల పల్లకీలో ఒహోం ఒహోం అని ఊరేగిస్తున్నవారు....

ప్రజల పేరుచెప్పి నక్సల్బరీ బిడ్డలను సజీవ దహనం చేసే విద్యను కనిపెట్టినవారు, మావోయిస్టుల ఎన్‌కౌంటర్లను కనిపెట్టిన రాజ్యానికి నాయకత్వం వహించినవారు, మమతా బెనర్జీ రాకముందు వరకూ కూడా మావోయిస్టులను కాల్చి చంపే కార్యక్రమాన్ని ఉద్యమంగా చేపట్టినవారు....

చర్చల పేరుతో మావోయిస్టుల ఆనుపానులను కనిపెట్టి ఆనక రక్తపుటేరుల్లో ముంచిన మహానేత కరస్పర్శతోనూ, ముగింపు తెలియని ఉద్యమంలో ఉద్వేగంతో ఊగిపోతున్న యువకుల కరస్పర్శతోనూ ఏకకాలంలో పులకించిపోయే వంచక మేధావులు.... అందరూ తెలంగాణ గడ్డమీద ఇప్పుడు ఒకే భాష మాట్లాడుతుండడం, ఒకే బాటన నడుస్తూ ఉండడం విస్మయం కలిగిస్తున్నది.

మావోయిస్టుల సిద్ధాంతాలు, ఆశయాలు, త్యాగాలు, నిజాయితీ ఎంత గొప్పవయి నా కావచ్చు. అటువంటి త్యాగం అందరూ చేయలేరన్నదీ నిజం. సమాజంలో ఎంతో కొంతమందిలో అసంతృప్తి, నిరసన, పోరాటం అనివార్యంగా కొనసాగుతాయన్నదీ నిజం. కానీ వారు అనురిస్తున్న మార్గం తప్పా ఒప్పా అని చెప్పలేని మేధావులు వారిని కీర్తించడమే విషాదకరం. గతం నుంచి పాఠాలు నేర్చుకోకపోవడం ప్రమాదకరం. నక్సల్బరీలో మొదలయిన వసంతకాల మేఘ గర్జనలు అక్కడ పలుచబడిపోయి శ్రీకాకుళం వచ్చాయి. అక్కడ కూడా ఆధునిక రాజ్య వ్యవస్థ ధాటికి తట్టుకోలేక ఓడిపోయి, బలహీనపడిపోయి, గోదావరి లోయకు పాకాయి. అక్కడా అదే అనుభవం. అక్కడి నుంచి ఇప్పుడు ఛత్తీస్‌గఢ్ అడవులకు వెళ్లారు. అక్కడ కూడా ముగింపు తెలుస్తూనే ఉంది. మావోయిస్టులు నిర్మించుకున్న దుర్భేద్యత శాశ్వతం కాదు. పల్లెలను విముక్తి చేసి, పట్టణాలను స్వాధీనం చేసుకుని, మొత్తం దేశాన్ని మావోయిస్టు రాజ్యంగా మార్చ డం అన్నది ఎంత అమాయకపు ఆలోచనో మనవాళ్లకు ఇంకా ఎందుకు అర్థం కావ డం లేదు? 1949లో చైనా విముక్తికోసం మావో అనుసరించిన రైతాంగ సాయుధ పోరాట పరిస్థితులు నేడున్నాయా? రోడ్డు, రవాణా,

కమ్యూనికేషన్, నిఘా... ఏ వ్యవ స్థలూ అందుబాటులో లేని ఆ కాలంలో మావో ముందుగా గ్రామీణ ప్రాంతాలను, ఆ తర్వాత పట్టణాలను విముక్తి చేసి చైనాలో విప్లవ విజయం సాధించారు. అదే విధానాన్ని కొనసాగించడం 1950లోనే తెలంగాణలో సాధ్యం కాలేదు. 1970లలోనే సాధ్యం కాలేదు. ఇప్పుడెలా సాధ్యమవుతుందని ఆ యువకులను బలిపీఠంపైకి ఎక్కిస్తున్నారు? గట్టు మీద కూర్చుని గట్టి మాటలు చెప్పడం సులువే. నమ్మి ఆచరించేవారు, బలైపోతున్నవారు మావోయిస్టులు. నమ్మకం లేకపోయినా సానుభూతి చూపేవారు మానవతావాదులు. గతం, వర్తమానం అంతా రక్తంతో తడిసిన చేతులతో కరచాలనం చేసినవాళ్లు, చేస్తున్నవాళ్లు విప్లవం గురించి మాట్లాడటమే వంచన. తప్పును తప్పని చెప్పకపోవడం, అంతిమ ఫలితాలు తెలిసీ వారిని నిప్పుల కుంపటిలోకి తోయ డం నేరం. సాయుధ పోరాట పంథా తప్పని చెబితే త్యాగాలు చేసిన వారిని కించపర్చడం కాదు. తప్పని చెప్పినంత మాత్రాన పోరాటం ఆగిపోతుందనీ కాదు. కానీ విచక్షణాపరులు చేయవలసిన పని చేయకపోతే అది ఆ సమాజానికి చేటు చేస్తుంది. చివరికి దుఃఖం, సంతాపాలు మిగులుతాయి.


ఎన్‌కౌంటర్ నిజమో కాదో తెలియదు. పోలీసులు ఇది నిజమైన ఎన్‌కౌంటర్ అని చెబుతున్నారు. చేతికి చిక్కిన వారిని చిత్రవధ చేసి చంపారని మావోయిస్టు ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఒకటి మాత్రం వాస్తవం ఎన్‌కౌంటర్ చేసిన తీరు, శృతి, విద్యాసాగర్‌ల మృతదేహాలను ఛిద్రం చేసిన తీరు చూస్తే అది కేవలం ఎన్‌కౌంటర్‌లాగా లేదు. ఏదో శత్రుదేశ సైనికులపై దాడి చేసి కసి తీర్చుకున్నట్టనిపించింది. పోలీసు లు ఏ యుద్ధ నీతినీ పాటించలేదు. మనిషిని చంపడానికి ఒక్క బుల్లెట్, అయినా వంద బుల్లెట్‌లు అయినా తేడా ఏమీ ఉండదు. కానీ పోలీసులు అణువణువూ ఛిద్రం చేసేంత దౌష్ట్యాన్ని వారి శరీరాలపై చూపించారు. కనీసం మనుషులుగా వ్యవహరించలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తొలిసారి ఇటువంటి పరిస్థితి ఎదురుపడినప్పుడు పోలీసులు పరిస్థితిని సంయమనంతో ఎదుర్కోవలసింది. శృతి, వివేక్, సాగ ర్ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నవారు. వారిని సజీవంగా పట్టుకుని సమాజం ముందు పెట్టి, తెలంగాణలో ఇటువంటి కార్యకలాపాలను అంగీకరించబోమని చెప్పి ఉండవలసింది. మారడానికి వారికి అవకాశం ఇచ్చి ఉండాల్సింది. మన రాష్ట్రం మనం సాధించుకున్నాం. నిన్నగాక మొన్న వచ్చిన రాష్ట్రంపై యుద్ధం చేయాల్సిన అవసరం ఏమిటి? ఇప్పటిదాకా చేసిన త్యాగాలు చాలు. ఇప్పుడు మీరు త్యాగా లు చేయాల్సిన అవసరం లేదన్న సందేశాన్ని ఈ సందర్భంగా యువతకు పంపి ఉంటే బాగుండేది. మొదలు పెట్టడమే సంహారంతో మొదలుపెట్టారు. ఎంత బీభత్సంగా చంపితే అంత భయపడతారని పోలీసులు భావిస్తుండవచ్చు. కానీ చరిత్రలో ఎప్పు డూ అలా జరగలేదు. యువకులు మరింత రిపల్సివ్‌గా తిరగబడతారని ఎందుకు అర్థం కావడం లేదు? ఇంత ఆధునిక యుగంలో కూడా ఈ అనాగరిక యుద్ధ నీతి ఎందుకు? మన రాష్ట్రం ఎన్‌కౌంటర్లు లేని తెలంగాణను కోరుకోవడం నిజమే. అంటే మావోయిస్టుల అవసరం లేని తెలంగాణను కోరుకోవడం. సాయుధ పోరాటం అవసరం లేని తెలంగాణను కోరుకోవడం. సాయుధ మావోయిస్టులను స్వేచ్ఛగా తిరగనిచ్చే తెలంగాణ కాదు అన్న వాస్తవాన్ని కూడా వారిని సమర్థించేవారు గ్రహించాలి. తెలంగాణ ఇప్పటివరకు అనుభవించిన క్షోభ చాలు. ఇప్పటి వరకు చేసిన త్యాగాలు చాలు. అత్యంత చైతన్యవంతులైన, క్రియాశీలురైన, సాహసులైన యువకులు, సమాజానికి గొప్పగొప్ప పనులు చేసిపెట్టగల యువకులు వేలాదిమంది ఇలా అడవిదారిలో నేలకొరగడం ఎంతమాత్రం మంచిది కాదు.

తెలంగాణ సాయుధపోరాటాన్ని ప్రారంభించిన రావి నారాయణరెడ్డి, ఈ త్యాగా లు, రక్తపాతం ఇక చాలు. ఇంకా సాయుధ పోరాటం కొనసాగించడానికి తరుణం కాదు అన్న పాపానికి పార్టీ డబ్బులతో పరారయిన రావి నారాయణరెడ్డి అని ఆనాడే పత్రికల్లో రాయించారు కొందరు సాయుధ పోరాట ప్రేమికులు. చైనా మార్గమే మన మార్గమని నమ్మి, విముక్తి ప్రాంతాలను కాపాడుకోవడానికి సాయుధ పోరాటం కొనసాగించాలని జాతీయ కమ్యూనిస్టు పార్టీతో తీర్మానం చేయించి తెలంగాణను బలిపీఠంగా మార్చేశారు అప్పటికి తెలంగాణ కమ్యూనిస్టు పార్టీపై పెత్తనం చేస్తున్న కొంద రు ఆంధ్రా కమ్యూనిస్టు నాయకులు. దళాల్లో సాయుధ పోరాటాన్ని విరమిద్దామని అన్న పాపానికి కొంత మంది కామ్రేడ్లను దారుణంగా కాల్చి చంపారు. దళాల్లో సభ్యు ల సంఖ్య తగ్గిపోయింది. గ్రామాల్లో ప్రజలు కూడా స్వాతంత్య్రం వచ్చింది ఇంకెందుకు ఈ పోరాటం అన్న భావనతో దళాలకు సహకరించడం మానేశారు. అట్టడుగుస్థాయిలో వచ్చిన మార్పులను గమనించకుండా సాయుధపోరాటం కొనసాగించడం తప్పని రావి నారాయణరెడ్డి పార్టీ పెద్దలకు నివేదించడానికి బొంబాయి వెళ్లారు. ఆంధ్ర నాయకత్వంపై నమ్మకం లేక ఆయన బొంబాయికి వెళ్లారని వేరే చెప్పనవసరం లేదు. అలా వెళ్లినందుకు ఆయనను ఎన్నిరకాల వేధించాలో అన్ని రకాలుగా వేధించింది సాయుధ పోరాటాన్ని వెనుకేసుకొచ్చిన అతివాద ముఠా ఆయనను కేంద్ర కమిటీ నుంచి తొలగించింది. బొంబాయి నుంచి కదలవద్దంది. ఆయన ఖర్చులు ఆయనే భరించుకోవాలని చెప్పింది. ఎవరూ ఆయనను కలవకుండా కట్టడి చేసింది. చివరికి 1951లో ఆయన చెప్పిన మార్గానికే వచ్చి సాయుధ పోరాటాన్ని విరమించింది కమ్యూనిస్టు పార్టీ. రావి నారాయణ రెడ్డి రాష్ర్టానికి చేరే సమయానికి ఆయనపై చేయాల్సిన దుష్ప్రచారమంతా చేసిపెట్టింది సాయుధ పోరాటాన్ని సమర్థించిన గుంపు. పిరికివాడని, పారిపోయాడని, అమ్ముడుపోయాడని, రెనెగేడ్ అనీ.. ఎన్ని పేర్లు పెట్టాలో అన్ని పేర్లు పెట్టారాయనకు. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరిగింది. కానీ పార్టీలో చండ్ర రాజేశ్వర్‌రావు వంటి చాలా మంది సీనియర్ నాయకులు తమ తప్పిదాలను గుర్తించి 1952 ఎన్నికల్లో ఆయనకు పార్లమెంటు టికెట్ ఇచ్చారు. అతివాద ముఠా కూడా రావి నారాయణ రెడ్డి ఎలాగూ ఓడిపోతాడని భావించి ఆయన అభ్యర్థిత్వానికి ఎదురు చెప్పలేదు. కానీ ఎన్నికలలో నల్లగొండ ప్రజలు రావి నారాయణ రెడ్డికి మొదటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కంటే అధిక మెజారిటీని కట్టబెట్టి భారత ఎన్నికల చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. సాయుధ పోరాటం ఇప్పుడు ఇక్కడ సరిపోదని ప్రకటించిన రావి నారాయణరెడ్డిని నల్లగొండ ప్రజలు ఎందుకు గెలిపించినట్టు? అరవై ఐదేళ్ల తర్వాత ఇప్పుడు కూడా తిరిగి ఇదే చర్చ. సాయుధ పోరాటం ఇప్పుడు ఆచరణ సాధ్యమా? కాదని చెప్పే ధైర్యం లేదు.

ఆచరణ సాధ్యం కాని ఆయుధాలు పట్టుకోవడం, కాలుతుందని తెలిసి మంటల్లో దూకడం, అంతిమ ఫలితాలు పదేపదే ఇలాగే ఉంటున్నాయని అనుభవంలోకి వచ్చిన తర్వాత కూడా బలిపీఠంపైకి ఎక్కడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అడవుల్లో పాఠాలు చెప్పుకోవడానికి, గిరిజనులకు వ్యవసాయం, విద్యాబుద్ధులు చెప్పడానికి వెళితే ఎవ రూ అభ్యంతర పెట్టరు. దేశంలో నడిమధ్యన నాలుగు జిల్లాల పరిధిలో తుపాకులతో ప్రవేశించి ఇది జనతన రాజ్యమని ప్రకటించి, సరిహద్దులు గీసి, ఇది దాటివస్తే శిక్షలు ఉంటాయని చెప్పిన తర్వాత ఈ చిన్న రాజ్యం చుట్టూ ఉన్న పెద్ద రాజ్యం చూస్తూ ఊరుకుంటుందని ఎలా అనుకుంటున్నారు? ఒక వర్గం మీడియా, సీపీఎంతో సహా కొన్ని రాజకీయపార్టీలు ఇప్పుడు విప్లవగీతాలు ఆలాపించవచ్చు. కానీ వారి చరిత్రను ఎవరూ తుడిపేయలేరు. మేము ప్రభుత్వాలను శాసిస్తాం. నడిపిస్తాం. కాళ్లదగ్గరకు తెచ్చుకుంటాం. ఎవరినయినా లొంగ దీసుకుంటాం అని భ్రమించిన మీడియా తెలంగాణలో అది సాగకపోయే సరికి భంగపడి విచ్చలవిడిగా తెలంగాణ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నది. అందుకు ఏ సందర్భం దొరికినా అది వదలడం లేదు. మావోయిస్టులపై వారి విపరీత ప్రేమ కూడా అందులో భాగమే. ఆ మీడియా ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి వంద అబద్ధాలను చెబుతుంది.

లేని పెద్దరికాన్ని మీద వేసుకుని, తెలంగాణకోసం తామేదో పొడిచామని చెప్పుకోడానికి అబద్ధాలను కుమ్మరిస్తున్నది. మీడి యా అధిపతులు పైరవీలు చేస్తే గద్దర్ వంటి వారు అంగీకరించి దీక్ష విరమించాల్సిందిగా కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారని ఎవరయినా నమ్మితే అంతకంటే అమాయకత్వం మరొకటి ఉండదు. సీపీఎంది కూడా ఈ మీడియాధిపతి లక్షణమే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన ఏకైక పార్టీగా ఆ పార్టీ గత కొన్నేళ్లలో చాలా పేరు మూటగట్టుకుంది. మావోయిస్టులను ఊచకోత కోసిన పార్టీగా కూడా వారికి ఘనమైన చరిత్రే ఉంది. ఇప్పుడు అవన్నీ మరిపించడానికి మావోయిస్టులను మించిన మావోయిస్టు పార్టీగా ఆ పార్టీ ప్రవర్తిస్తున్నది. చెదిరిపోయిన శ్రేణులను పోగేసుకోవడానికి, మసకబారిన ప్రతిష్టను పునరుద్ధరించుకోవడానికి ఆ పార్టీ ఎవరో ఉసిగొల్పిన పందెంకోడిలాగా కాలు దువ్వుతున్నది. అయితే ప్రజలకు ఇవన్నీ అర్థం కాకుండా పోవు. వీరంతా తెలంగాణను విఫలం చేయడానికి పాటుపడుతున్నారా సఫలం చేయడానికి తోడ్పడుతున్నారా అన్నది జనానికి మెల్లగానయినా తెలిసి వస్తుంది. ఒక మౌనం నియంతృత్వానికి దారితీస్తుందని కొందరు బాధపడిపోతున్నారు. నిజమే మాట్లాడితే విద్రోహుల ముద్ర పడిపోతుందేమోనని చాలా మంది మౌనం వహిస్తుండవచ్చు. మాట్లాడకపోతే భావజాల నియంతృత్వం రాజ్యం చేస్తుందన్నదీ నిజం.


kattashekar@gmail.com  

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...